పెద్దపల్లి : ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై మంత్రి మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరాబాద్‌లో ఉండి కాదు క్షేత్రస్థాయిలో చూసి మాట్లాడాలన్నారు. 2014కు ముందు అదేవిధంగా 2020లో పంటల సాగు దిగుబడులు చేస్తే అర్థమౌతుందన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో ఎలా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో తెలియడం లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుందో రైతులకు తెలుసన్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి ఉన్నా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.